pro kabaddi

pro kabaddi ప్రొ కబడ్డీకి కొత్త చాంపియన్‌
టైటిల్‌ పోరులో పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌ ఢీ
తొలి టైటిల్‌ కోసం ఇరు జట్ల తహతహ
శుక్రవారం ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 1న (శుక్రవారం) హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌ టైటిల్‌ వేట సాగించనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టాన్‌ రెండోసారి ఫైనల్లో పోటీపడుతుండగా.. హర్యానా స్టీలర్స్‌ తొలిసారి టైటిల్‌ పోరుకు చేరుకుంది.

పుణెరి పల్టాన్‌ గత సీజన్‌ జోరు కొనసాగించింది. వరుసగా రెండో ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రతిష్టాత్మక పీకెఎల్‌ టైటిల్‌ అందుకునేందుకు పుణెరి పల్టాన్‌కు ఇది మరో అవకాశం. కెప్టెన్‌ అస్లాం ఇమాందార్‌ జట్టును ముందుండి నడిపిస్తుండగా, సహచర ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారు. పీకెఎల్‌ పదో సీజన్‌లో పుణెరి పల్టాన్‌ సక్సెస్‌కు సమిష్టి ప్రదర్శనే ప్రధాన కారణం.

గ్రూప్‌ దశ మ్యాచుల అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి పల్టాన్‌ ఫైనల్లో పోటీపడేందుకు పూర్తి అర్హమైన జట్టుగా నిరూపించుకుంది. పుణెరి పల్టాన్‌ విజయాల్లో ఆ జట్టు స్టార్‌ డిఫెండర్‌ మొహ్మద్‌రెజా శాడ్లోయి చియానె అత్యంత కీలక పాత్ర పోషించాడు. రెయిడింగ్‌లో మోహిత్‌ గోయత్‌, పంకజ్‌ మోహిత్‌ సైతం అంచనాలను అందుకున్నారు.

పీకెఎల్‌ తొలి సెమీఫైనల్లో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించిన అనంతరం జట్టుపై కెప్టెన్‌ అస్లాం ఇనాందార్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘జట్టు ఎంత బాగుంటుందో కెప్టెన్‌ అంతే బాగుంటాడు. జట్టులోని అందరు ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు, వ్యక్తిగతంగా నా ప్రదర్శన పట్ల సైతం సంతోషంగా ఉన్నాను. ఈ సీజన్‌లో మా జట్టు రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో నిలకడగా రాణించటంతో నా ఆత్మవిశ్వాసం ఎక్కువైంది. సెమీఫైనల్లో ఇది మరింత ఎక్కువగా అనిపించింది’ అని అస్లాం ఇనామ్‌దార్‌ తెలిపాడు.

టైటిల్‌ పోరులో హర్యానా స్టీలర్స్‌ను ఎదుర్కొనే కఠిన సవాల్‌ కోసం పుణెరి పల్టాన్‌ పూర్తి సన్నద్దంగా ఉందని అస్లాం విశ్వాసం వెలిబుచ్చాడు. ‘నాతో సహా జట్టులోని అందరు ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటున్నారు. దీంతో మేము పీకెఎల్‌ ట్టోఫీ సొంతం చేసుకోగలం. జట్టు సాధన చేయని సమయంలో మేమందరం వ్యక్తిగత ఫిటెన్‌నెస్‌ మెరుగుపర్చుకోవటంపై ఫోకస్‌ పెట్టాం. టైటిల్‌ పోరు సవాల్‌ కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాం. ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ నెగ్గుతామనే నమ్మకం ఉంది’ అని అస్లాం అన్నాడు.

మరోవైపు, ఈ సీజన్‌లో ఆరంభం నుంచి ఆకట్టుకునే ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్‌ తొలిసారి పీకెఎల్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. మూడుసార్లు ఫైనలిస్ట్‌ మన్‌పీత్‌ సింగ్‌ శిక్షణ సారథ్యం, యువ నాయకుడు జైదీప్‌ సింగ్‌ సారథ్యం, యువ రక్తంతో కూడిన ఆటగాళ్లు హర్యానా స్టీలర్స్‌ను లీగ్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేర్చేందుకు దోహదం చేశాయి.

సెమీఫైనల్‌ 2లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించిన అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ జైదీప్‌ సింగ్‌.. ప్రత్యర్థి ప్రదర్శనను పొగుడుతూనే, ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్లో సొంత జట్టు విజయంపై నమ్మకం వెలిబుచ్చాడు. ‘పుణెరి పల్టాన్‌ ఎంతో కఠిన ప్రత్యర్థి. లీగ్‌ దశ మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌పై మేము విజయం సాధించాం. ఇదే సమయంలో ఆ జట్టు మమ్మల్సి సైతం ఓడించింది. దీంతో ఫైనల్‌ పోరు మరింత ఆసక్తికరంగా సాగనుంది. మోహిత్‌, అస్లాం ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు, పుణెరి పల్టాన్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలువటంలో ఈ ఇద్దరు ముఖ్య పాత్ర పోషించారు. కానీ హర్యానా స్టీలర్స్‌ ఏమాత్రం తక్కువ కాదు, ఓ జట్టు టైటిల్‌ కోసం పోరాడుతుంది’ అని జైదీప్‌ సింగ్‌ అన్నాడు.

పుణెరి పల్టాన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో ఫైనల్‌కు చేరటం ఇది రెండోసారి కాగా, హర్యానా స్టీలర్స్‌ టైటిల్‌ పోరుకు చేరటం ఇదే ప్రథమం. పుణెరి పల్టాన్‌ గత సీజన్లోనూ ఫైనల్‌కు చేరినా.. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు పదో సీజన్‌ ఫైనల్లో పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌లో ఎవరు నెగ్గినా.. ప్రొ కబడ్డీ లీగ్‌కు కొత్త చాంపియన్‌ రానుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ మార్చి 1 షెడ్యూల్‌ :
ఫైనల్‌ మ్యాచ్‌ : పుణెరి పల్టాన్‌ వర్సెస్‌ హర్యానా స్టీలర్స్‌
వేదిక : జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియం, హైదరాబాద్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌ స్టార్‌స్పోర్ట్స్‌ నెటవర్క్‌ సహా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Share