PKL Season 10 ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్లో హర్యానా స్టీలర్స్‌పై పుణెరి పల్టాన్ గెలుపు
చాంపియన్ పుణెరి పల్టాన్
ప్రొ కబడ్డీ లీగ్‌కు కొత్త చాంపియన్ వచ్చేసింది. పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ చాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో హర్యానా స్టీలర్స్‌పై అద్భుత విజయం నమోదు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతిమ పోరులో పుణెరి పల్టాన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచింది. ఉత్తమ డిఫెన్స్ జట్ల నడుమ సాగిన టైటిల్ పోరులో 28-25తో హర్యానా స్టీలర్స్‌పై పుణెరి పల్టాన్ గెలుపు ఢంకా మోగించింది. పుణెరి పల్టాన్ తరఫున పంకజ్ మోహిత్ 9 రెయిడ్ పాయింట్లతో చెలరేగగా.. మోహిత్ గోయత్ (5), అస్లాం ఇమాందార్ (4), డిఫెండర్ గౌరవ్ ఖత్రి (4) రాణించారు. హర్యానా స్టీలర్స్ తరఫున శివం (6), సిద్దార్థ్ దేశాయ్ (4), వినయ్ (3), మోహిత్ రాణించారు. ఊహించినట్టుగానే ఫైనల్లో ఫలితాన్ని డిఫెన్స్ బలమే శాసించింది. పుణెరి పల్టాన్, హర్యానా స్టీలర్స్ రెయిడింగ్‌లో సమానంగా 17 పాయింట్లు సాధించాయి. డిఫెన్స్‌లో పుణెరి పల్టాన్ 9 పాయింట్లు సహా ఓ ఆలౌట్ బోనస్ దక్కించుకుంది. హర్యానా స్టీలర్స్ ఐదు ట్యాకిల్స్‌కే పరిమితమై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు చేరుకున్న పుణెరి పల్టాన్ పట్టు పట్టుదలతో టైటిల్ పట్టేసింది.
ఆద్యంతం ఉత్కంఠ
పుణెరి పల్టాన్, హర్యానా స్టీలర్స్. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో రెండు ఉత్తమ డిఫెన్స జట్లు. రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో రెండు జట్లు సమవుజ్జీలు. దీంతో సహజంగానే టైటిల్ పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో పది నిమిషాల్లో రెండు జట్లకూ పెద్దగా పాయింట్లు లభించలేదు. ఇరు జట్లు బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని నిలువరించాయి. 7-7తో మ్యాచ్ రసపట్టులో సాగుతున్న దశలో పుణెరి పల్టాన్ రెయిడర్ పంకజ్ మోహిత్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చావోరేవో రెయిడ్‌లో పంకజ్ మోహిత్ కూతలో కేక పెట్టాడు. సూపర్ రెయిడ్‌లో నాలుగు పాయింట్లు సాధించిన పంకజ్ మోహిత్.. పుణెరి పల్టాన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 9-13తో హర్యానా ఆలౌట్ ప్రమాదంలో నిలువగా.. విశాల్ మెరుపు రెయిడ్‌తో ఆ జట్టను రేసులో నిలిపాడు. ప్రథమార్థం ఆట ముగిసే సరికి పుణెరి పల్టాన్ 13-10తో ముందంజ వేసింది.
పుంజుకున్నప్పటికి
సెకండ్ హాఫ్‌లో హర్యానా స్టీలర్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం దక్కలేదు. ద్వితీయార్థం ఆరంభంలోనే రెయిడ్ పాయింట్ సాధించిన పుణెరి పల్టాన్ 14-10తో జోరు కొనసాగించింది. ఓ దశలో 18-11తో పుణెరి పల్టాన్ గెలుపు ఖాయం చేసుకుంది. శివం, సిద్దార్థ్ దేశాయ్, వినయ్, మోమిత్‌లు మెరవటంతో హర్యానా స్టీలర్స్ పుంజుకుంది. ఆఖరు పది నిమిషాల్లో పాయింట్లు సాధించిన హర్యానా స్టీలర్స్ పాయింట్ల అంతరం కుదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ద్వితీయార్థంలో పుణెరి పల్టాన్‌తో సమానంగా హర్యానా స్టీలర్స్ సైతం 15 పాయింట్లు సాధించినా… తొలి 20 నిమిషాల్లో సాధించిన మూడు పాయింట్ల ఆధిక్యమే పుణెరి పల్టాన్‌ను ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ చాంపియన్‌గా నిలిపింది.