
MLC Kavitha
ఏకకాలంలో రైతు భరోసా నిధులను విడుదల చేయాలి
సర్పంచులకు పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం రోజున పలువురు తాజా మాజీ సర్పంచులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రైతాంగం పడుతున్న కష్టాలపై, పెండింగ్ బిల్లులు విడుదల కాక పడుతున్న ఇబ్బందుల గురించి కవిత దృష్టికి తీసుకొచ్చారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తారు. కెసిఆర్ హయాంలో రైతుబంధు నిధులు టంగుటంగు మని రైతుల ఖాతాలో పడేవని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దశలవారీగా నామమాత్రపు నిధులను మాత్రమే విడుదల చేస్తూ రైతులను ఇబ్బందులపాలు చేస్తుందని విమర్శించారు. రైతులు పంట వేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయి నిధులు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది రైతులకు ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు. రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే తాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇక సర్పంచులకు పెండింగ్ బిల్లులపై స్పందిస్తూ… సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాది అయినా ఇంకా నిధులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతను తెలియజేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసిన గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సర్పంచులకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.