ఆటోలో అసెంబ్లీకి పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆటో డ్రైవర్లకు మద్దతుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చారు.అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు హృదయాన్ని కలిచివేస్తున్నాయని అన్నారు. తాను ఆటోలో వస్తున్నప్పుడు ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్వయంగా డ్రైవర్లే తనతో చెప్పారని అన్నారు. కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిగా ఉందని తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.ఆటో డ్రైవర్లకు మద్దతుగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఆటోని అసెంబ్లీకి అనుమతించలేదని, ఆటో డ్రైవర్లపై ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు కూడా ఓటు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు.ఇప్పటికే రాష్ట్రంలో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆటో డ్రైవర్లు ఎవరు అధైర్య పడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై కూడా తప్పక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు