HCA దివ్యాంగ క్రికెటర్లకు అండగా ఉంటాం
హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు
దివ్యాంగ క్రికెటర్లకు అన్ని విధాలా హెచ్‌సీఏ అండగా ఉంటుందని, ఆ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు భరోసా ఇచ్చారు. మంగళవారం అత్తాపూర్ లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన దివ్యాంగుల క్రికెట్ టాలెంట్ హంట్ పోటీల ప్రారంభానికి జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోకుండా దివ్యాంగ ప్లేయర్లు అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించారు. దివ్యాంగ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్న డిఫరెంట్లీ ఏబెల్డ్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ (డిఏసీఏహెచ్) సభ్యులను అభినందించారు. వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మిగిలిన సభ్యులతో చర్చించి, దివ్యాంగ క్రికెటర్ల శిక్షణ, ఇతరత్రా సదుపాయాల కల్పనలో ఏ విధంగా సాయం చేయవచ్చో ఒక ప్రణాళిక రూపొందిస్తామని జగన్‌మోహన్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస రావు, సీనియర్ క్లబ్ మెంబర్ శ్రీధర్, డిఏసీఏహెచ్ సభ్యుడు సురేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.