hca president jagan mohan rao

HCA President Jagan Mohan Rao :హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు

విద్యుత్‌ సమస్యకు పరిష్కారం
ఉప్పల్‌ స్టేడియం విద్యుత్‌ సమస్యకు హెచ్‌సీఏ పాలకమండలి పరిష్కారం తీసుకొచ్చింది. హెచ్‌సీఏ ఎన్నడూ విద్యుత్‌ బకాయిలు పడలేదు. రూ.1.67 కోట్లకు సంబందించిన నోటీసులు కేవలం సర్‌ చార్జీలకు సంబంధించిన అంశం. సర్‌ఛార్జీలపై మినహాయింపు కోసం గత హెచ్‌సీఏ పాలకమండలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడల పట్ల ఔత్సాహికంగా ఉన్నారు. దీంతో మేము సైతం సర్‌ఛార్జీల మాఫీ కోసం సీఎంతో సంప్రదింపులు జరపాలని అనుకుంటున్న తరుణంలో విద్యుత్‌ శాఖ అధికారులు మ్యాచ్‌కు ముందు ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇది పూర్తిగా ఊహించని పరిణామం. సీఏంఓ అధికారులు, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల చొరవతో ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం లభించింది. హెచ్‌సీఏ ఇప్పటికే తక్షణ చెల్లింపుగా రూ. 15 లక్షలు జమ చేసింది. మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో మూడు విడతలుగా చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఇక నుంచి ఉప్పల్‌ స్టేడియానికి విద్యుత్‌ సరఫరా అంశంలో ఎటువంటి అంతరాయం ఉండబోదు.

ఉప్పల్‌ స్టేడియం ఆధునీకరణ
ఉప్పల్‌ స్టేడియం తెలంగాణకు గర్వకారణం. కాలానుగుణంగా స్టేడియాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూనే ఉన్నాం. 2023 ఐసీసీ వరల్డ్‌కప్‌ సమయంలో స్టేడియంలో నూతన పైకప్పు, సీటింగ్‌, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల ప్రేక్షకుల సౌకర్యం కోసం టాయిలెట్లు, కార్పోరేట్‌ బాక్స్‌ రూమ్‌లు, జనరల్‌ స్టాండ్స్‌, లిఫ్లులు, లాంజ్‌లను ఆధునీకరించాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన అనంతరం ఉప్పల్‌ స్టేడియం ఆధునీకరణ పనులు మొదలుపెట్టనున్నాం. ఉప్పల్‌ స్టేడియం ప్రస్తుత సామర్థ్యం 39 వేలు. అవసరమైతే స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం పెంపు అంశం సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్‌ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకునే యోచనలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఉంది. హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా కనీసం లక్ష మంది సామర్థ్యంతో కూడిన స్టేడియం అవసరం. అన్నీ అనుకూలిస్తే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మరో నూతన స్టేడియం నిర్మాణానికి సైతం సిద్ధంగానే ఉంది.

Share