cpi

CPI తెలంగాణ విలీనం దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
హైదరాబాద్: తెలంగాణ విలీనం దినోత్సవం వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సిపిఐ హైదరాబాద్ సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధులు మగ్ధూం మొహియుద్దీన్ విగ్రహాం నుంచి లిబర్టీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహాం వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మగ్ధూం మొహియుద్దీన్ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంట రెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈ.టి.నర్సింహా, కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్ర చారి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయదేవి, సహాయ కార్యదర్శులు స్టాలిన్, కమతం యాదగిరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితమే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమని స్పష్టం చేశారు. అంతటి మహోత్తర పోరాటం జరిగిన తెలంగాణలో నేటికి పాలకులు అధికారికంగా విలీన దినోత్సవ వేడుకలు జరపకపోవడం దారుణమన్నారు. అదే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో విలీనం దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుతుండగా, రైతాంగ సాయుధ పోరాటం కేంద్ర బిందువుగా సాగిన తెలంగాణలో మాత్రం పాలకులు ఎంఐఎంకు భయపడి ఇప్పటికీ నిర్వహించకపోవడం సిగ్గు చేటన్నారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒత్తిడికి తట్టులేక హైదరాబాద్ సంస్థానం ఎక్కడ కమ్యూనిస్టుల వశం అవుతుందోనని, నిజాం రాజు అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కలిసి విలీనం నాటకం ఆడారని అన్నారు. సెప్టెంబర్ 13న హైదరాబాద్ కేంద్ర బలగాలు బయలుదేరితే 17న నిజాం రాజు లొంగిపోతున్నట్లు ప్రకటించగా, ఇందుకు బదులుగా కేంద్రం నిజాంకు లెక్కలేనంత రాజ భరణాలతో పాటు అత్యంత రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుందన్నారు. ఆలాంటి మహోత్తరమైన సాయుధ పోరాట చరిత్రను నేడు వక్రీకరించడం దుర్మార్గమన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టుల వీర మరణంతో పాటు అనేక మంది అనేక త్యాగాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది తప్ప కేంద్ర బలగాల రాకతో కాదన్నారు. ఇది హిందూ ముస్లింల పోరాటం కాదని, 90 శాతం మంది మట్టి మనుషులు బందుకులు పటి ్ట నిజాం నిరంకుశ రాక్షస పాలనకు చరమగీతం పాడిన మహోన్నత ఉద్యమం అన్నారు. ఈ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులదేనని, సెప్టెంబర్ 17న తెలంగాణ విలీనం దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్యనాయక్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు కె.శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.కాంతయ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు పడాల నళిని, ఎన్.శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, శంషుద్దీన్, సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Share