CM Revanth Reddy రాష్ట్రంలో క్రికెట్‌ సర్వతోముఖాభివృద్ధికి భారీ ప్రణాళిక

  • స్టేడియాల నిర్మాణానికి భూములు కావాలని స‌ర్కార్‌ను కోరిన హెచ్‌సీఏ
  • సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి
  • హైదరాబాద్‌ పరిసరాల్లో 100, ఉమ్మడి జిల్లాల్లో 25 ఎకరాల సమీకరణకు కసరత్తు
    హైదరాబాద్‌: రాష్ట్రంలో క్రికెట్‌ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, అలానే ప్రస్తుత అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లోనూ మరో అంతర్జాతీయ స్టేడియం కట్టాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కోశాధికారి సీజే శ్రీనివాస్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి వినతిపత్రం అందించారు. సోమవారం సీఎం కార్యాలయంలో హెచ్‌సీఏ విన‌తిప‌త్రాన్ని రేవంత్ రెడ్డికి శ్రీనివాస్ స‌మ‌ర్పించారు. ఈ లేఖలో ప్రధానంగా హైదరాబాద్‌ పరిసరాల్లో నూతన స్టేడియం కట్టడానికి ప్రభుత్వ ధర ఆధారంగా 100 నుంచి 120 ఎకరాలు కావాలని జగనమోహన్‌ రావు కోరారు. ‘ప్రస్తుతమున్న ఉప్పల్‌ స్టేడియం 37 వేల సీటింగ్‌ సామర్థ్యమే కావడంతో అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచలు జరుగుతున్నప్పుడు అభిమానులు ఇబ్బందులకు గురవతున్నారు. పార్కింగ్‌ కూడా కేవలం 500 వాహనాలకు మాత్రమే ఉండడంతో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. అలానే ఉప్పల్‌ మినహా నగరంలో హెచ్‌సీఏకు గ్రౌండ్లు లేకపోవడంతో ఏటా 30-40 మైదానాలను అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. అవి బీసీసీఐ నిబంధనలకు తగినట్టు లేకపోవడంతో మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యపడడం లేదు. కాబట్టి ప్రభుత్వం భూమి చూపిస్తే అధునాతన హంగులతో ఒక లక్ష మంది మ్యాచ్‌ను చూసే సామర్థ్యం గల కొత్త స్టేడియం, అందులో ఐదు ప్రాక్టీసు గ్రౌండ్లు, హైపెర్ఫామెన్స్‌ సెంటర్‌ నిర్మించి, రాష్ట్రంలో క్రికెట్‌ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పతాం’ అని లేఖ‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రతి జిల్లాలో 25 ఎకరాల భూమి ఇస్తామని, అన్ని చోట్ల మంచి స్టేడియాలు నిర్మించి, యువ క్రికెటర్ల బంగానే భవిష్యత్‌కు బాటలు వేయాలని సీఎం రేవంత్‌ సూచించినట్టు శ్రీనివాస్‌ తెలిపారు. భూసమీకరణకు చర్యలు తీసుకోవాలని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డిని రేవంత్‌ ఆదేశించినట్టు శ్రీనివాస్‌ చెప్పారు. ఇక, హెచ్‌సీఏ విజ్ఞప్తికి సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఆయనకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగనమోహన్‌ రావు కృతజ్ఞతలు తెలిపారు.
Share