Buchi Babu Trophy :ఆలిండియా బుచ్చిబాబు టోర్నీలో హైదరాబాద్ ఘన విజయం
- ఏడేళ్ల తర్వాత తిరిగి ఈ ట్రోఫీ సాధించిన తెలంగాణ జట్టు
- ప్లేయర్లను అభినందించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు
- టీమ్‌ను ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు
హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ట్రోఫీ సాధించింది. బుధవారం తమిళనాడులోని దిండిగల్‌లో చత్తీశ్‌గఢ్‌తో ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ జట్టు ఈ ట్రోఫీను సాధించడంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి రాష్ట్రానికి ట్రోఫీ అందించినందుకు జట్టు మొత్తాన్ని అభినందించారు. ఫైనల్లో చెలరేగి, హైదరాబాద్ గెలుపులో కీలకపాత్ర పోషించిన సెంచరీ హీరో రోహిత్ రాయుడు (155 తొలి ఇన్నింగ్స్), హాఫ్ సెంచరీలతో అలరించిన అభిరథ్ రెడ్డి, కెప్టెన్ రాహుల్ సింగ్, బౌలింగ్‌లో చెలరేగిన తనయ్ త్యాగరాజ్, అనికేత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్ చేరుకున్నాక జట్టు సభ్యులను ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జగన్మోహన్ రావు తెలిపారు.