pawan kalyan

Pawan Kalyan:శాసన సభలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దాము

జనసేన శాసన సభ్యులకు సభ నియమావళిపై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మనపై ప్రజలు ఎన్నో ఆశలతో… ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రయిక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దాము’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ శాసన సభ్యులకు మంగళవారం ఉదయం సభా వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మన నుంచి గెలిచినవారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారే. అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలి. నియమావళిని పాటిస్తూ, సంప్రదాయాలను గౌరవించాలి. సభలో హుందాగా ఉండాలి. మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మన్ననలు పొందాలి. సభలో కొద్ది రోజుల కిందటే ప్రమాణం చేశాము. ఇక్కడి నుంచి తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టిపెట్టండి. ప్రభుత్వ శాఖలను, పాలనపరమైన విధివిధానాలను, నిబంధనలను, పథకాలను, వాటి అమలు తీరునీ, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా… లాంటి విషయాలను అధ్యయనం చేయాలి. ఆ తరవాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి.
శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమంగా సాగాలి. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీపడవద్దు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి. గంజాయి, మాదకద్రవ్యాల మాఫియా ఆందోళనకర పరిస్థితులు సృష్టించాయి. డ్రగ్స్ ముఠాలు, బ్లేడ్ బ్యాచ్ ల నుంచి యువతను కాపాడుకోవడం సమాజానికి ఎంతో అవసరం. ఆ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నాము.
మర్యాదపూర్వకమైన భాష వాడాలి
విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండవచ్చు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పరుష పదజాలం వాడవద్దు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలి.
నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టండి
మన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమం అయిన తరవాత మీరు నియోజకవర్గ స్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టండి. మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులను, మన పార్టీ నాయకులను అభినందించండి.
పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పని చేసిన వారిని గుర్తించండి. వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలి. వారితో గౌరవభావంతో ఉండాలి. మన పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీపై ఉంది. ఇటువంటి అవగాహన చర్చలు ప్రతి నెల నిర్వహించుకుందాము. అలాగే నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది. మీరు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెలా జనవాణి చేపట్టండి” అన్నారు.
బడ్జెట్ సమావేశాల చర్చల్లో ప్రభావశీలంగా పాల్గొనాలి: నాదెండ్ల మనోహర్
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు. మనం సభలో లేవనెత్తే అంశాలు, చర్చల్లో పాల్గొనేందుకు తగిన అధ్యయనం చేయాలి. మన నియోజకవర్గ అంశాలను ప్రస్తావించడంతోపాటు వాటిని రాష్ట్ర స్థాయి కోణంలో కూడా సభలో చర్చించడం కూడా ముఖ్యం” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శాసన సభ్యులు పాల్గొన్నారు.

Share