HCA Domestic Leagues For Women Cricketers తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం హెచ్ సీఏ డొమెస్టిక్ లీగ్స్
- అమ్మాయిలకు ప్రత్యేక క్రికెట్ అకాడమీ
- డబ్ల్యూపీఎల్‌లో ఎక్కువ మంది ఆడేలా శిక్షణ ఇస్తాం
- 6 ఎకరాల్లో నిజామాబాద్‌లో స్టేడియం నిర్మిస్తాం
- నిఖత్‌ను ఆదర్శంగా తీసుకొని ఎదగాలి
- హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు & కార్యదర్శి దేవ్ రాజ్
జాతీయ స్ధాయిలో, డబ్ల్యూపీఎల్ వంటి లీగ్స్‌లో రాణించేలా రాష్ట్రంలోని మహిళా క్రికెటర్లకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు చెప్పారు. బుధవారం నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి జగన్‌మోహన్ రావు, హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ ఈ శిబిరంలో అబ్బాయిలు కంటే అమ్మాయిలే ఎక్కువ మంది కనిపిస్తుండడం శుభ పరిణామం అన్నారు. క్రికెట్‌కు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తాము కూడా వారిని అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం డొమెస్టిక్స్ లీగ్స్ ను ప్రవేశపెడుతున్నట్టు దేవ్ రాజ్ వెల్లడించారు. అమ్మాయిలకు త్వరలో ఒక ప్రత్యేక క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తామని దేవ్ రాజ్ తెలిపారు.
6 ఎకరాల్లో కొత్త స్టేడియం..
నిజామాబాద్‌లో 6 ఎకరాల్లో కొత్త స్టేడియం నిర్మిస్తామని, వచ్చే ఏడాది అక్కడే సమ్మర్ క్యాంప్ నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తామని సీజే శ్రీనివాస్ అన్నారు. ఈ జిల్లాకే చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను ఆదర్శంగా తీసుకుని మహిళా క్రికెటర్లు మరింత మంది ముందుకు రావాలని, ఆస్థాయిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి, సెక్రెటరీ వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.