HCA Summer Camp: హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్స్ షురూ
రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభం
3 వేల మందికి పైగా పిల్లలకు ఉచితంగా కోచింగ్
వీరిలో గుర్తించిన ప్రతిభావంతులకు లీగ్‌ల్లో ఆడే చాన్స్
హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన వేసవి శిక్షణ శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని లాలాపేట్ సమ్మర్ క్యాంప్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు, కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ కలిసి లాంఛనంగా ప్రారంభించగా, మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు కలిసి ఆరంభించారు. ఈ సందర్భంగా లాలాపేట్‌లో జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించామని చెప్పారు. ఈ సమ్మర్ క్యాంప్స్‌కు మంచి స్పందన వచ్చిందని, ఇందులో మూడు వేల మందికి పైగా శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్యాంప్స్‌లో ప్రతిభావంతులను గుర్తించి లీగ్స్‌లో ఆడే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్న 29 సెంటర్లలో ఉన్నత ప్రమాణాలు కలిగిన కొన్ని కేంద్రాలను హెచ్‌సీఏ అకాడమీలుగా మార్చే ఆలోచన ఉందన్నారు. అలానే తొలిసారిగా క్రికెటర్ల ప్రొఫైల్స్ డిజటలైజేషన్‌కు నాంది పలికామని తెలిపారు. సమ్మర్ క్యాంప్స్‌లో పాల్గొన్న ప్రతి ప్లేయర్ వివరాలను హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయనున్నామని చెప్పారు.
సర్టిఫికెట్ల ప్రదానం
ఈ క్యాంప్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్లేయర్‌కు సర్టిఫికెట్ ఇవ్వనున్నామని జగన్‌మోహన్‌రావు తెలిపారు. ప్రతిభావంతులకు ప్రత్యేకంగా మెరిట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తామని చెప్పారు. వచ్చే నెల 20వ తేదీన జింఖానా స్టేడియంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇందులో జిల్లా క్రికెటర్లను కూడా భాగం చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది 10 వేల మంది క్రికెటర్లతో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. త్వరలో హెచ్‌సీఏ లీగ్స్, ఇతర టోర్నమెంట్ల క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నామని చెప్పారు. విరామం లేకుండా ఏడాది పొడువునా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు క్రికెటర్లను ఆడించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జగన్‌మోహన్‌రావు వివరించారు.