HCA Summer Camp:జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి తొలి అడుగు
ఈ నెల 20 నుంచి హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్‌లు
25 కేంద్రాల్లో 30 రోజుల పాటు ఉచితంగా క్రికెట్ శిక్షణ
హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడి.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో మెగా సమ్మర్ క్రికెట్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి కట్టుబడుతూ, పేద క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారి వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సిద్ధమవైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు కనీసం 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. హెచ్‌సీఏ శిక్షణ శిబిరంలో ఉచిత క్రికెట్ శిక్షణ కోసం ఈ నెల 15 నుంచి ఔత్సాహిక క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మేరకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు.
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు దేవరాజు, దల్జీత్ సింగ్, శ్రీనివాసరావు, బసవరాజు, సునీల్ అగర్వాల్, సీఈవో సునీల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రతి జిల్లాకు రూ. 15 లక్షలు
తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి హెచ్‌సీఏ కట్టుబడి ఉంది. వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కోసం ప్రతి జిల్లా క్రికెట్ సంఘానికి ఇప్పటికే రూ. 15 లక్షల నిధులు విడుదల చేశాం. ప్రతి జిల్లాలో మూడు కేంద్రాల్లో క్రికెట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ప్రతి శిక్షణ కేంద్రానికి రూ. 5 లక్షలు వెచ్చించనున్నాం. ప్రతి శిక్షణ కేంద్రంలో 80-100 మంది వరకు ప్రవేశాలు ఇవ్వనున్నాం. శిక్షణ సమయంలో 30 రోజుల పాటు క్రికెటర్లకు పౌష్ఠికాహారం సైతం అందించనున్నాం. వేసవి శిక్షణ శిబిరాలను దీర్ఘకాలంలో క్రికెట్ అకాడమీలుగా రూపుదిద్దనున్నాం. ఏ జిల్లాలోనైనా నిపుణులైన కోచ్‌లు, ఫిజియోలు అందుబాటులో లేకుంటే.. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఎన్‌ఐఎస్ కోచ్‌లు, ఫిజియోలను జిల్లా కేంద్రాలకు పంపిస్తాం. సమ్మర్ క్యాంప్ అనంతరం జిల్లా జట్లను ఎంపిక చేసి హైదరాబాద్‌లో జిల్లాల క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాం. జింఖానా తరహా క్రికెట్ మైదానాలను హైదరాబాద్‌లో మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఏ ఆలోచన చేస్తుంది.