pm modi

PM Modi జగన్ పార్టీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే-ప్రదాని మోదీ

రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు… రెండూ ఒకటే. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరూ ఈ రెండు పార్టీలకు సారథ్యం వహిస్తున్నారు. మేం వేర్వేరు అంటూ నాటకాలు ఆడుతూ వైసీపీ సర్కారు మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను మెల్లగా కాంగ్రెస్ వైపు మళ్లేలా చేయాలన్నదే వీరి ప్లాన్. కచ్చితంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతిలో సగ భాగం కాంగ్రెస్ కు వెళ్తోంద’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు చెట్టాపట్టాలేసుకున్నాయి అని చెప్పారు.

వైసీపీ మంత్రులంతా అవినీతిలో పోటీ పడుతున్నారు

వైసీపీ పాలనలో మంత్రులంతా అవినీతి చేయడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ఈ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. జనసేన – బీజేపీ – తెలుగుదేశం ఉమ్మడిగా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించిన ‘ప్రజా గళం’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రం చాలా వెనక్కు వెళ్లిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేశాం. కేంద్రం ఆధ్వర్యంలోని అనేక విద్యా సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. వాటికి సరైన ప్రాధాన్యం వైసీపీ ఇవ్వలేకపోయింది. వాటికి పూర్తిస్థాయి వసతులు కల్పించడంలో వెనుకబడింది. ఎన్ఐటీ, ఐఐటీ, ఐసర్, ఎయిమ్స్, గిరిజన యూనివర్శిటీ, ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్శిటీ వంటి వాటిని ఆంధ్రప్రదేశ్ కు అందించిన ఘనత కచ్చితంగా కేంద్రానికే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.

వికసిత భారత్.. వికసిత ఆంధ్రా ఎన్టీయే లక్ష్యం

వికసిత్ భారత్ అనేది ఎన్టీయే లక్ష్యం. ఈ లక్ష్యంలో వికసిత ఆంధ్రప్రదేశ్ కు చోటు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం. ఎన్డీయే కూటమి దేశానికి ఎంత అవసరమో, రాష్ట్రానికి అంతే అవసరం.  కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ప్రయాణం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. సభకు వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీ పాలన పట్ల ఎంత ఆవేదనగా ఉన్నారో అర్ధం అవుతుంది. కచ్చితంగా ఎన్టీయే ప్రభుత్వంలో దేశం, రాష్ట్రం.. అభివృద్ది దిశలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తాయి.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పాలన చేశాం

కాంగ్రెస్ పాలనలో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతిసారి భంగం కలిగిస్తే, ఎన్టీయే పాలనలో తెలుగు వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చాం. సినిమాల్లో రాముడు, కృష్ణుడి పాత్రల్లో ఎన్టీఆర్ లాంటి మహామనిషి ఒదిగిపోయిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి శతాబ్ది ఉత్సవాలను కేంద్రం తగిన విధంగా గుర్తించి, వెండి నాణెం విడుదల చేసింది. తెలుగు వారి ముద్దుబిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి ఎన్టీయే భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. పార్టీలకు అతీతంగా మేం భారతదేశ ముద్దుబిడ్డలకు తగిన గౌరవం ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే, మేం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం.

రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది

ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు బలంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దేశంలో మూడోసారి ముచ్చటగా ఎన్టీయేకు అండగా నిలవాలని, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడి ప్రభుత్వం మార్పునకు వారు సంకల్పం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పేదరికం నిర్మూనల కోసం ఈ రెండు సంక్పలాలను తీసుకొని ప్రజలు వారి బతుకులను బాగు చేసుకోవాలి. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ పాలనను పూర్తిగా ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర పురోభివృద్ధి, భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించి ఓటు వేస్తారని భావిస్తున్నాను.

ఇండియా కూటమిదీ యూజ్ అండ్ త్రో విధానం

ఎన్టీయే కూటమి సుస్థిర పాలన కోసం అందరినీ కలుపుకుపోయే విధానాన్ని అవలంబిస్తుంది. దేశం కోసం ఆలోచిస్తుంది. ఇండియా కూటమిలోని వారిది ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి… తర్వాత వారిని ఎలా విసిరి వేయాలనే విధానం మాత్రమే. కేవలం యూజ్ అండ్ త్రో విధానంతోనే ఇండియా కూటమి పార్టీలన్నీ పని చేస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీల్లోని ఒక్కో నాయకుడిది ఒక్కో మాట. వారి విధానాలేమిటో తెలీదు. కేవలం అధికారం కోసం పాకులాడటం తప్పితే ప్రజలకు ఏం చేస్తామనే దానిపై వారికి స్పష్టత లేదు. అలాంటి వారు దేశాన్ని ఎలా ప్రేమిస్తారు.. ప్రజలకు ఏం చేస్తారు. ఎన్టీయే పదేళ్ల పాలనలో 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం అని గర్వంగా చెబుతున్నాం. ఎన్నో పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నాం. వారి క్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తున్నాం. ఎన్టీయే కూటమిలోనే ఉన్న పవన్ కళ్యాణ్ కాని, కూటమిలోకి కొత్తగా వచ్చిన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు… ఇద్దరూ రాష్ట్రం, దేశం కోసం ఆలోచించే నాయకులు. ప్రజల కోసం పోరాటాలు చేయగల సమర్ధులు కూటమిలో ఉండటం ఎన్టీయే బలం.

వచ్చే అయిదు సంవత్సరాలూ కీలకం

అభివృద్ధి ఆగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే అయిదు సంవత్సరాలూ చాలా కీలకం. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే అయిదేళ్లలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుకు వెళ్లేలా మేం ప్రణాళికతో ముందుకు వెళ్తాం. పారిశ్రామిక అభివృద్ధి, పోర్టులు, బ్లూ ఎకానమీ తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కు కొత్త అవకాశాలు సృష్టించి ముందుకు తీసుకెళ్లేలా చూస్తాం. సభలో ప్రతి ఒక్కరూ వేసిన సెల్ ఫోన్ టార్చ్… ఆంధ్రప్రదేశ్ కు వెలుగులు నింపేందుకు సంకేతంగా భావిస్తున్నాను’’ అన్నారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు తో ప్రత్యేక సంభాషణ

ప్రజా గళం సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తో ప్రత్యేకంగా సంభాషించారు. ప్రజలు ఎన్డీయే కూటమి పట్ల ఉత్సాహాన్ని చూపించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Share