pawankalyan

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి

కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము

పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులు, నాయకులతో తెలియచెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలి అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు, కొందరు ముఖ్య నాయకులతో బుధవారం ఉదయం నుంచీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ముఖాముఖీ చర్చించారు. కందుల దుర్గేష్ (నిడదవోలు), పంతం నానాజీ (కాకినాడ రూరల్), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), లోకం మాధవి (నెల్లిమర్ల)లతోపాటు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, దేవ వరప్రసాద్, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, ఆరణి శ్రీనివాసులుతో ఈ రోజు చర్చించారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల నియమావళి, నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకూ ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు, పొందాల్సిన అనుమతులను తెలియచేసే పత్రాలను అందచేశారు.

ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి  తీసుకురండి

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా ముందుకువెళ్లాలని… టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రతి దశలోనూ అభ్యర్థులు, నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

Share