pawankalyan

Pawankalyan ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం చారిత్రక పొత్తుకు అడుగులు వేశాం-పవన్ కళ్యాణ్

ఒక అసాధ్యమైన, అసాధారణమైన రాజకీయ కలయికను రాష్ట్రంలో సాకారం చేయగల శక్తిని మీ అభిమాన బలమే నాకు అందించింది. నాకు ఓటమిలోనూ వెన్నుదన్నుగా నిలిచింది. రెండు చోట్లా ఓడిపోయినా ప్రజల గుండెల్లో నాకు అత్యున్నత స్థానం ఇచ్చారు. ఈ బలంతోనే రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే తపనతో కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ అసాధ్యంగా కనిపించిన పొత్తును సుసాధ్యం చేశామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ కంబంధహస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి నవ శకంలోకి అడుగుపెట్టడానికి ఈ పొత్తు ఎంతో ఉపకరిస్తుందని ఆకాంక్షించారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన అనుచరులతో కలసి మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పొత్తులో భాగంగా జనసేన తీసుకున్న సీట్లు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో నా ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి ఉంటే పరిస్థితి ఇప్పుడు వేరుగా ఉండేది. మనం మాట్లాడేందుకు అది ఎంతో సహకరించేది. గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయి అంటారు పెద్దలు. గత ఎన్నికల్లో చేసిన తప్పు మనల్ని వెంటాండింది. అయినా రాష్ట్ర క్షేమం కోసం రాష్ట్రంలో అసాధ్యమైన పొత్తును మనం సాధించగలిగాం. ఇది గర్వకారణం అని చెప్పను కానీ… ఇది రాష్ట్రానికి చాలా కీలకం. మీ గుండెల్లో నాయకుడిగా నన్ను నిలిపిన స్థానమే నాకు ఈ శక్తినిచ్చింది.

కుబేరుల పట్టణాన్ని రౌడీ చేతిలో పెట్టారు

రాష్ట్రంలో కుబేరులు ఎక్కువగా ఉండే పట్టణంగా భీమవరానికి పేరుంది. అలాంటి పట్టణాన్ని 2019లో ఒక రౌడీ చేతిలో పెట్టారు. దీనివల్ల భీమవరంలో నిమ్మకాయ సోడాలు అమ్ముకునేవాళ్ళు కూడా ఆ రౌడీ బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. భీమవరంలో ఈ ఎమ్మెల్యే వల్ల అక్రమ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగిపోయాయి.భీమవరం వచ్చి శాశ్వతంగా ఉండటానికి 2019 నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ అక్కడ ఈ ఎమ్మెల్యేకు భయపడి స్థలం లేదా ఇళ్లు అమ్మడానికి లేదా లీజుకు ఇవ్వడానికి స్థానికులు భయపడుతున్నారు. నాలాంటి వ్యక్తికే ఎమ్మెల్యే మూలంగా ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఊహించుకోవచ్చు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేస్తే ఎలా ఉంటుందో భీమవరం ప్రజలు ఇప్పుడు స్వయంగా తెలుసుకుంటున్నారు. నేను రాష్ట్రం కోసం, దేశం కోసం ఆలోచించేవాడిని. నా కోసం ఆలోచించే కొందరు ఉంటారని అనుకున్నాను. అయితే ఆ సమూహం గత ఎన్నికల్లో సరిపోలేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇలాంటి వ్యక్తి ని ఎన్నుకోకుండా ధైర్యంగా పనిచేద్దాం. నేను పాలసీలు గురించి ఎంత గట్టిగా మాట్లాడతానో… గొడవలకు సిద్ధం అంటే దానికి పదింతలు సిద్ధంగా ఉంటాను. నాకు ఎలాంటి భయాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే జగన్ పోవాలి. జగన్ తోపాటు జగన్ జలగలను ఏరిపారేద్దాం.

రాష్ట్రంలో జగన్… భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ పోవాలి

 గత సార్వత్రిక ఎన్నికల్లో మనకు ప్రత్యర్థిగా బరిలో నిలిచిన గ్రంథి శ్రీనివాస్ మా బంధువు, మా కులపు వ్యక్తి అనే కోణంలో చాలా మంది అతనికి మద్దతుగా నిలిచారు. మన పార్టీలోనూ కొందరు అదే పద్ధతిలో సహకరించారు. రాజకీయాల్లో యుద్ధం మాత్రమే ఉంటుంది. బంధుత్వం ఉండదు. కౌరవులు, పాండవులు అన్నదమ్ములైనా 18 అక్షౌహిణిలతో యుద్ధం చేశారు. 2019లో భీమవరం ఎన్నికల్లో నేను కత్తి దూసినప్పుడు చాలా మంది గ్రంథి శ్రీను మా బంధువు అంటూ మన వెనక ఉండటానికి భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు మన పార్టీలో లేరు. యుద్ధంలో దిగితే బంధుత్వాలు ఉండకూడదు.  కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భీమవరంలో గెలిచి తీరాలి. దీనిని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతిసారి కోకిలలా సిద్ధం… సిద్ధం అంటున్న జగన్ కు మరిచిపోలేని యుద్ధం ఇద్దాం. యుద్ధం అంతిమలక్ష్యం రాజకీయ ప్రక్షాళన, ప్రభుత్వ మార్పు. రాష్ట్రంలో జగన్ ను, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ను ఓడిద్దాం.

175 సీట్లలోనూ మూడు పార్టీలూ పోటీ చేస్తున్నట్లే

రాష్ట్ర భవిష్యత్తు కోసం, వైసీపీ పాలనలో దశాబ్దాలపాటు వెనక్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు దశ, దిశా చూపేందుకు రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా, బయటకు వెళ్లకుండా సంపూర్ణంగా ప్రజలంతా ఒకే తాటిపైకి రావాలని తీసుకున్న నిర్ణయం ఇది. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ప్రధానం కాదు. 175 సీట్లలో మూడు పార్టీలూ పోటీ చేస్తున్నట్లే. కచ్చితంగా ఈ నవ శకం పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తుంది. ఒకడి దగ్గరే అధికారం, డబ్బు, అవినీతి, కిరాయి సైన్యం, అరాచకం ఉంటే ప్రజలెవరూ బతకలేరు. జగన్ లాంటి వ్యక్తి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో రౌడీయిజం పోవాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు ఉండాలి. రాష్ట్రంలో పెరిగిపోయిన క్రిమినల్ చెట్లను కూకటి వేళ్లతో సహా పెకిలించాలి. మే 15లోపు మనం కలలు కన్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దగ్గరలోనే ఉంది. రానున్న నెల రోజుల పాటు కష్టపడి పనిచేసి మన కలను సాకారం చేసుకుందాం. రౌడీల చేతిలో రాజ్యం ఉండకూడదు అనేదే మన నినాదంగా వైసీపీని తరిమేద్దాం

భీమవరం గెలిచి తీరుతాం 

మన బంధువు, మన కులపోడు అయితే ప్రజలపై అన్యాయంగా దాడులు చేస్తే అతడికి మద్దతుగా ఉంటామా…? ప్రజాప్రతినిధిగా ఉండేవాడు సరైనోడా..? మంచి చేసేవాడా..? సమాజానికి అండగా ఉండేవాడా..? అనేది మాత్రమే చూడాలి. మన కులస్తుడా..? బంధువా..? అనేది చూడాల్సిన అవసరం లేదు. భీమవరం ఎమ్మెల్యే హయాంలో బెదిరింపులు, దౌర్జన్యాలు అధికమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి తప్పులు చేస్తుంటే అతడిని వెనకేసుకొచ్చేవారు కూడా అదే తప్పు చేసినట్లే. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన అనంతబాబుకి జేజేలు కొడుతుంటే ఏమనాలి. ఒక కులంలోని వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పును కులానికి అంటగట్టడం తప్పు. కానీ గ్రంథి శ్రీనివాస్ లాంటి వ్యక్తి చేస్తున్న తప్పుడు పనులు ఇప్పుడు మొత్తం కులానికి చుట్టుకునే దుస్థితి వచ్చింది. నాయకుడు అంటే గొడవలు తగ్గించేవాడు. ప్రజలకు అండగా నిలబడే వాడై ఉండాలి. పులపర్తి రామాంజనేయులు నేను భీమవరంలో ఓడిపోయినప్పుడు ఎంతో బాధపడ్డారు. నేను పోటీ చేస్తున్నానని తెలిస్తే అధిష్టానంతో మాట్లాడి అయినా పోటీ నుంచి తప్పుకునే వాడినని చెప్పడం హత్తుకుంది. అలాంటి వారు ప్రజలకు నిలబడతారు. అంజిబాబు గారి లాంటి వారు భీమవరానికి చాలా అవసరం. ఈ సారి వైసీపీ ఎన్ని కోట్లు కుమ్మరించినా ఎదుర్కొనేందుకు బలంగా నిలబడండి. ఈ సారి భీమవరం కొట్టి తీరుతాం. జగన్ తో పాటు జగన్ తాలుకా జలగలను ఏరిపారేస్తాం.  నేను వేదికపై నుంచి రామాంజనేయులుని ఒకటే కోరుతున్నాను. భీమవరంలో నాకు ఒక స్థలం చూపించండి. నేను కొనుక్కుంటాను. అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకుందాం. భీమవరం నాది… దానిని వదలను. భీమవరంలో పెరిగిపోయిన రౌడీయిజాన్ని కట్టడి చేయడంపై దృష్టిపెడతాం. ఆంధ్రాను అక్కున చేర్చుకునే వ్యక్తిని… భీమవరాన్ని గుండెల్లో పెట్టుకుంటాను” అన్నారు.

Share