cm revanth reddy బీఆరెస్ అంటే బిల్లా రంగా సమితి-సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.బీఆరెస్ అంటే బిల్లా రంగా సమితి అని కొత్త అర్థం చెప్పారు.హరీష్, కేటీఆర్ ను చూస్తుంటే బీఆరెస్ బిల్లా రంగా సమితిలా కనిపిస్తోందని ఎద్దేవా చేసారు.పదవి పోయి మతి భ్రమించి బీఆరెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు.
కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోసారని కార్యకర్తలే మనకు ముఖ్యం.. పదవులు కాదు అని నాయకులకు చెప్పారు.హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు బిడ్ద బూర్గుల రామకృష్ణా రావును తొలి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలంగాణ వచ్చాక ఏర్పడిన మొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు బిడ్డనైన నన్ను ముఖ్యమంత్రిగా చేసి పాలమూరు గడ్డపై సోనియమ్మ తన ప్రేమను చాటుకున్నారని గుర్తు చేసారు.పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టుకుని భుజాన మోసారు అందుకే ఆత్మవిశ్వాసంతో ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడగలిగానని అన్నారు.
ప్రదాని మోదీని కలవడంపై సీఎం రేవంత్ వివరణ
పాలమూరుకు, తుమ్మిడిహెట్టికి, మూసీ అభివృద్ధి, మెట్రోకు నిధులు ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతలకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రదాని మోదీని అడిగిన అని అన్నారు.రేవంత్ మోదీకి ఎందుకు వినతిపత్రాలు ఇచ్చావని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారని నేనేం ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్లు పట్టుకోలేదని చెవిలో గుస గుసలు చెప్పలేదని బాజాప్త ప్రధాని మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చా అని అన్నారు.అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను బలంగా నమ్మిన కాబట్టే ప్రదానిని కలిసా అని అన్నారు.మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇస్తే మన గౌరవం పెరుగుతుందని అన్నారు.దేశ ప్రధానికి గౌరవం ఇచ్చినం మన సమస్యల్ని ఏకరువు పెట్టినం మనం అడిగిన సమస్యలు తీర్చకపోయినా మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాక ఉతికే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు.మన మంచితనం చేతకానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనే కేంద్ర రాష్ట్రాల మధ్య సంఘర్షణ ఉంటే అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని సంఘర్షణ వైఖరి ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి వినతులు ఇచ్చాం అని అన్నారు.
విజ్ఞత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం కావాలో ఏం తేవాలో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విజ్ఞతతో ప్రధాని మోదీకి వినతులు ఇచ్చామని అన్నారు.
బీఆరెస్ అంటే బిల్లా రంగా సమితి..
హరీష్, కేటీఆర్ ను చూస్తుంటే బీఆరెస్ బిల్లా రంగా సమితిలా కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.పదవి పోయి మతి భ్రమించి బీఆరెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని అన్నారు.3650 రోజులు అధికారంలో ఉన్న కేడీ, మోదీ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.పాలమూరులో విద్య కోసం వైద్యం కోసం.. ఉద్యోగాల కోసం ఉపాధికోసం.. సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాపాలమూరును అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నాదని అన్నారు.నేను మీ బిడ్డను.. ఈ మట్టిలో పుట్టా… పాలమూరును దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చి దిద్దుతా అని అన్నారు.
తాగితే ఒకటి దిగితే ఇంకోటి మాట్లాడటానికి నేను కేసీఆర్ ను కాదని నేను మీ రేవంతన్నను అని అన్నారు.కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే ఆరోగ్యం బాగాలేదని హరీష్ చెబుతుండు ఆరోగ్యం బాగలేనోడు మరి నల్లగొండ సభకు ఎట్ల పోయిండని ప్రశ్నించారు.ఈ నెల 11న ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించబోతున్నామని మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల్లో విశ్వాసం కలిగించామని అన్నారు.
పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ విధ్వంసం చేస్తే.. ఒక్కొక్క శకలాన్ని తొలగించి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్నామని గుర్తు చేసారు.కేసీఆర్ పదేళ్లు సీఎం గా ఉండొచ్చు.. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండచ్చు ,కానీ పేదోళ్ల ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆరునెలల్లో పడగొడుతారట విజ్ఞులు ఆలోచన చేయాలి… దుర్మార్గ రాజకీయాలను పాతరేయాలి..అని నిలదీసారు.
ఒక పాలమూరు రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారా?పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? ఆ హక్కు లేదా?టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలౌతారు.కేసీఆర్… విను.. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది..ఇది మా కార్యకర్తల మీద ఆన.. పాలమూరు బిడ్డగా మాట ఇస్తున్నా..పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం ఉంటది… పేదలకు అండగా ఉంటదని చెప్పారు.నాకు వయసుంది.. ఓపీక ఉంది.. ఎవరైనా అటు ఇటు చేస్తే తోక కత్తిరించేందుకు కత్తెర నా జేబులో ఉందని జెండాలు ఎజెండాలు కాదు…. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు గెలవాలి.. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని అన్నారు.
మొన్నటి వరకు దొరల గడీలను బద్దలు కొడతానాన్న మిత్రుడు ప్రవీణ్ దొర పంచన చేరిండని అలాంటి వ్యక్తి మన పాలమూరు గౌరవం నిలబెడతాడా? అని ఆర్ ఎస్ ప్రవీణ్ ని ఉద్దేశించి అన్నారు.
పార్లమెంటు ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే మొదలు పెట్టాం.. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతాం.పాలమూరు బీజేపీ నాయకులకు ఒక్కటే గుర్తు చేయదలచుకున్నా…పదేళ్లయినా మోదీ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.